Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

భగవదారాధనకు దేవాలయాలు
దివ్య సాధనాలు

భగవంతుని స్మరణ మనజీవితంలో ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు లభిస్తుందో, మనకున్న ఆయుస్సులో ఆ భాగమే సార్థకమైన జీవితం, మామూలుగా మనకు అనవసరమైన మాటలు, అనవసరమైన తలపులు ఎక్కువగా వస్తూవుంటవి. భగవంతుడు మనకు కొంత ఆయుస్సు ఇచ్చాడు గదా - ఇందులో భగవత్‌ స్మరణతో ఎన్నిగంటలు గడచినవి, అని మనస్సులో వివేచనం చేసి ఆలోచిస్తే మనకు శాంతి కలుగుతుంది, లౌకిక విషయాలు, నానారకాలైన యితర విషయాలను గురించి ఆలోచించినప్పుడల్లా, ఏదో ఒక ఉద్వేగమో, ఒక తాపమో, మోహమో, కామమో, భయమో కలుగుతుంది. భగవత్‌ స్మరణ చేస్తే శాంతం తప్ప మరొకటి కలుగదు.

అందరికీ కుటుంబభారం వుంది, భార్యాపిల్లల్ని, పెద్దవాళ్ళయిన తల్లిదండ్రుల్ని రక్షించాలి. ఇదంతా భారమే. ఇందుకని మనం అనేక విషయాలను గురించి మాట్లాడాలి. అనేక ఆలోచనలు పనులు చేయవలసిన అవసరం అందరికి వుంది. అయితే, ఇవి ఎంతవరకూ అవసరమో, అంతవరకు నిర్వర్తించి, మిగిలిన అవకాశాన్ని భగవత్‌ స్మరణతో గడపాలి, మనము ఇతర కార్యాల్లో నిమగ్నులమై నపుడుకూడా భగవన్నామస్మరణో, రూపస్మరణో, చేయవచ్చు. భగవత్‌ కథా కథనాన్ని గీతలో చెప్పినట్లు -

''కీర్తయంతః బోధయంతః కథయన్తశ్చ మాం నిత్యం ''

పలువిధాలుగా జేయవచ్చు, కాని భగవంతుని స్మరణకు మనకు అసలు అవకాశం చిక్కడం లేదంటున్నాము, ఆత్మ వివేచనం చేసికొని, ఆత్మ శోధనం చేసికొని నిజంగా భగవత్‌ స్మరణకు అవకాశం కలగడం లేదేమో చూడండి. ఆ విధంగా ఆత్వ వివేచనం చేసికొంటే భగవంతుడే మనకు పరిపూర్ణమైన అవకాశం ఇస్తాడు. భగవంతుడే మనల్ని తలుచు కుంటాడు. అందువల్ల అతని స్మరణ ఎంతకాలం మన జీవితంలో వుంటుందో అంతకాలం మన జీవితం సార్థకమవుతుంది. అవసరమైనంత వరకు, అత్యావశ్యక మైనంత వరకు కుటుంబ పోషణ చేసుకోవటం నీయమంగా పెట్టుకుంటే, ముప్పాతిక మాటలు, ముప్పాతిక పనులు అనవసరమై పోతాయి. కుటుంబాలలో వున్నవారు, గృహస్థాశ్రమంలో వున్నవారు. చిన్న చిన్న వృత్తులు చేసుకొనువారు అనేకమంది, అటు మహారాష్ట్రంలోను, ఇటు దక్షిణ దేశంలోను, ఇతర దేశాలలోను కూడ మహాభక్తులు, మహా జ్ఞానులు అయినారు. వారికి ఆ అవకాశం పరిపూర్ణంగా దొరికింది, అయినా, మనకు అవకాశం లేనే లేదంటున్నాము, కాని పాపసంపాదనానికి మాత్రం అవకాశం కల్పించు కుంటున్నాము.

శరీరం బాగా వుండాలని, ఆరోగ్యం బాగావుండాలనీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కాని అదేమి బాగాలేదు, భగవత్‌ స్మరణచేతనే, ఆరోగ్యమైన కుటుంబపోషణమైనా కొంతకు కొంత జరుగు తున్నది.

''అనన్యాశ్చింతయంతో మాం యేజనాః పర్యుపాసతే,

తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం''

శాంతమైన వాడికి యోగక్షేమం బాగా జరిగిపోతుంది. శాంతంతో భగవత్‌ స్మరణ చేసుకుంటే యోగక్షేమంలో లోటు అతడే తొలగిస్తాడు. మనసులో లోటు అనే భావనకూడా రాదు. భగవత్‌ స్మరణ కలిగింది కదా అని శాంతం కలుగుతుంది.

పిల్లలకు, పెద్దలకు, అందరికీ భగవత్‌ స్మరణ, కలగాలనే ఉద్దేశ్యం తోనే దేవాలయాలు నిర్మింప బడినవి. బస్సులోనో, రైలులోనో, వెళ్తూ కనకదుర్గ దేవాలయాన్నో, మంగళగిరి గోపురాన్నో, అమరావతి ఆలయాన్నో చూసి, గుర్తించి నందువల్ల ప్రజలకు అప్రయత్నంగానైనా భగవత్‌స్మరణ కలిగే అవకాశం ఏర్పడుతున్నది. అందువల్లనే మన పూర్వీకులు ధర్మాలన్నింటిలో దేవాలయ నిర్మాణధర్మమే చాలా ఉత్తమమైన ధర్మమన్నారు. దేవాలయాన్ని చూడగానే ఇదొక గొప్పకట్టడం - ప్రపంచమంతా సృష్టి చేసిన వానికోసం కట్టిన ఇల్లు ఇది - అనే స్మరణ కలుగుతుంది. ఉత్తమమైన దేవాలయ ధర్మం శాశ్వతంగా వుండేది ఎంత శాశ్వతమైన వస్తువులతో ఆలయ నిర్మాణం చేస్తున్నామో ఆ ఆలయం అంతకు అంత శాశ్వతంగా కోట్లకొలది జీవులలో తక్షణం భగవత్‌ స్మరణను కలుగజేస్తున్నది.-అసలు దేవాలయమే కనుక లేకపోతే దేవుడనే వాడొకడున్నాడని సాధారణంగా మనకు స్మరణకు రావడానికి అవకాశ##మే లేకపోతుంది.

ఉత్తరదేశంలోనూ, దక్షిణదేశంలోనూ దేవాలయాలు కొల్లలుగా వున్నవి. కాశీలో వేలకొద్దీ దేవాలయాలు వున్నవి. అదేవిధంగా దక్షిణంలో కంచిలోకూడా వున్నవి. ఒరియా దేశంలోని జాజి పురిలో కూడా దేవాలయాలు మిక్కుటంగా వున్నవి. తంజావూరు, కుంభకోణంలో ఎన్ని దేవాలయాలు ఉన్నవో, ఒక్క జాజిపురిలో అన్ని వున్నవి. జాజిపురి వైతరిణీనదీతీరంలో వుంది. ఇది పూర్వం కాశీరామేశ్వరమార్గంలో వుండేది, రైలు వచ్చాక ఆమార్గాన ఇపుడు ఎవరూ వెళ్ళటం లేదు.

అడుగడుగుకూ యిన్ని దేవాలయాలు ఎందుకు కట్టించారు? పనికి మాలినవని-అవి పాడయి పోతాయికదా అని అడుగవచ్చు. డబ్బువుంటే, ఈ విధంగా ఖర్చుచేయకుండా, ప్రాణులకు ఉపకరించేపని మరేదైనా చేయకూడదా? అని అడగవచ్చు. మనకే ఆ విధంగా తోస్తుంది కూడాను.

మనకు బట్టకావాలి, ఇల్లుకావాలి, అన్నంకావాలి, వాహనం కావాలి, ధన, కనక, వస్తువాహన సమవృద్ధిరస్తు అని. ''వాహనం-ఛాయ-వస్తువు-తోయం-వసనం-ఆశనం-తేషు ఆసక్తకం'', ఇవన్నీ అందరికీ అవసరమే. మనము ఏ తంటాలు పడినా, ఇవన్నీ ఎవరో ఒకరు ఇస్తున్నారు. ఒక్క మెతుకు, ఒక్క అరటిఆకు, ఒక్కవిస్తరి మనం చేయగలమా? ఎవడో ఒకడు చేసి ప్రకృతిలో మనకు ఇస్తున్నాడు. మన శక్తికి మించిన శక్తిసంపన్నుడు ఎవడో ఒకడు ఇస్తున్నాడు. ఆశనం, వసనం, తోయం ఎవరివద్దనుండి వస్తున్నవో, ఎక్కడ నుంచి వస్తున్నదో మనకు తెలియదు. కాని, ఎవరో ఒకరు సిద్ధంచేసి-క్రిమిక్రీటకాదుల లగాయతు మానవులవరకు కావలసిన సర్వం అందిస్తున్నాడు.

ప్రభుత్వం ప్రజలకు నీరు సరఫరాచేయాలంటే ధవళేశ్వరంవద్ద పెద్దలాకులు నిర్మించి మెట్ట భూముల లోనికి కూడా నీరు పారేటట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యనిర్వహణకు వలసిన సిబ్బందినీ, గ్రామకరణాలు మొదలైన వారిని నియమించారు. అందుకు మనం ప్రతిప్రయోజనంగా, కృతజ్ఞతతో నీటి తీరువ కడుతున్నాము, మనకు ఇతర విధాలైన కష్టాలు వచ్చినపుడు చెప్పుకోవలసివస్తే, పోలీసులవారికి చెప్పుకోవడం కద్దు, అందుకని పోలీసులవారికి రెవెన్యూ శిస్తుమూలంగా కొంత ముట్టజెబుతున్నాం, కృతజ్ఞత చూపక ఇలాంటిపన్నులు మేము ఇవ్వమంటే వారు బలాత్కారం చేసి తీసుకువెళ్తారు. అయితే, ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. కదా, వారికి న్యాయం చేకూర్చాలి, అనేభావం ప్రభుత్వానికి కూడా వుండాలి. ఇల్లుకడితే ఇంటి పన్ను, డబ్బు నిల్వచేస్తే ఆదాయం పన్ను ఇలాగు ప్రతిదానికి -మనకొక ప్రయోజనం కలిగితే, ప్రతి ప్రయోజనాన్ని మనం న్యాయంగా, కృతజ్ఞతతో చేయాలి. ఇవన్నీ న్యాయంగా చెల్లించకపోతే, వారు బలాత్కారంగా లాక్కుపోతారని ఇస్తున్నా మనుకోండి. అది వేరే విషయం.

ఇటీవల మూడు సంవత్సరాలు వరాలుపడని కారణంగా ప్రజలు త్రాగడానికి కావలసిన నీరు లేదని ఇంజనీర్లు ప్రకటన చేశారు. గీతలో భగవంతుడు ''అహం వరం నిగృహ్ణామ్యుత్సృజామిచ'' నేనే వరాన్ని పంచిపెడుతున్నాను అని సెలవిచ్చాడు. అతడు వరం ఇస్తే ఇంజనీర్లు నీరు వచ్చి నపుడు ఆనకట్టకట్టి దానిని అందరికి అందజేస్తున్నారు. మన శక్తికిమించిన శక్తి ఉపకారం చేయడం వల్లనే ప్రజలు జీవిస్తున్నారు. మనం తినే తిండి, కూరగాయలు-అన్నీ మనశక్తికి మించిన చోటునుంచి వస్తున్నవి. అవి తిని మనం బ్రతుకుతున్నాం. ఆ అనంతమైన శక్తులు భగవంతునియొక్క సంకల్పం చేత మనకుపకరిస్తున్నవి.

ఉదాహరణకు ఒక రాజో, ప్రెసిడెంటో, వున్నాడను కుందాము. ప్రతిదేశంలోనూ ఇలాంటి అధిపతి వున్నాడు. పేరుకైనాసరే, ఇప్పటికీ బ్రిటనులో రాజు అనే వాడొక డున్నాడు, అక్కడ ప్రజలు పన్నులను నేరుగా రాజుకిస్తామంటే వీలుకాదు, రాజ్యాధిపతి ఏ ఉద్యోగిని ఏ మునసబును ఆపనికి నియోగించాడో అతనికే ఆపన్ను చెల్లించాలి. అది ఒక క్రమపద్ధతిలో చివరకు రాజుకు అందుతుంది.

మనకు ఎండకావాలి. వరం కావాలి. చాలాకాలం వరం పడకపోతే నాస్తికులు కూడా మీశాస్త్రంలో ఏమి చెప్పారో, అది చేయండి అని ఆస్తికులను అడుగుతారు. ఇంజనీర్లు కూడా ఆవిధంగానే అడుగుతారు.

ఆయామార్గాలను అనుసరిస్తున్న కారణంగా వరుణుడు, అగ్ని, పర్జన్యుడు, మొదలైన ముపై#్ఫ మూడుకోట్ల శక్తులు దేవతలనీ మనకు చెప్పారు. ఇదే విషయం గీతలో భగవంతుడు అర్జునుడికి- చెప్పినపుడు భగవంతుని ఆజ్జ చేతనే ఆ దేవతలు మనకు వరమిస్తున్నారు-ఎండ-ఇస్తున్నారు-వారికే మనం ప్రతి ప్రయోజనం ఇచ్చుకోవాలి. దీనిని మనం తెలుసుకోవాలి. భగవంతుని ఆజ్ఞవల్ల, ప్రభుత్వ ఆఫీసరుల్లాగా అనేక దేవతలు, దేవలోకాలు నియమింపబడ్డాయి. ఆ దేవతలను భావన చేసినపుడు ''అగ్నిముఖావై దేవాః '' అని హోమం చేసి ''ఇదం నమమ'' అని అంటున్నాం. ఈశ్వరునికి అభిషేకం చేసినపుడు కూడా, పాలు, పెరుగు, పండ్లు, నైవేద్యం వారికి అర్పణ చేస్తున్నాము, ఇలా అర్పణచేసిన దానిని కొన్నికొన్ని చోట్ల తిరిగి పుచ్చుకొని తినడానికి తీసుకు వెళ్తున్నారు. అప్పుడు ''నమమ'' అనే భావం అక్కడ లేదు. కాని, అగ్ని హోత్రంలో పడేసినది మీకు తిరిగి రాదు. ''నమమ'' అని ఇవ్వగా అది నిజమే అవుతుంది. నిజంగా మనం ఏ దేవతలను భావనచేస్తున్నామో అది కొంతైనా హోమం చేయాలి. అంతేకాదు. ఈశ్వరపూజలకు కూడా అంగంగా ఆలయంలో హోమాలు చేస్తారు. శైవ, వైఖానస, పాంచరాత్ర, ఆగమా లన్నిటిలోను పూజాంగ హోమం చేస్తారు. అప్పుడు''నమమ'' అనే భావంతోనే హోమం చేయాలి. ఈశ్వరాజ్ఞచేత ఆఫీసర్లుగా అనేక దేవతలు ఎక్కడెక్కడ వున్నారో, హోమం చేయబడినది వారికి అందాలని చేయాలి.

8-14ొ

మనశరీరానికి ఎక్కడ నీరు తగిలినా, అది మనస్సుకు స్పర్శగా తెలుస్తున్నది. అదే విధంగా శరీరంలో ఇక్కడ ఉపద్రవం, ఇక్కడ సుఖం అని తెలుస్తున్నది, ఈ శరీరం నఖశిఖపర్యంతం మనది అనే భావన ఎక్కడ సుఖం కలిగినా మనకు తెలుస్తున్నది. ఆవిధంగానే ప్రపంచములో ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నవో అన్నింట, ఒక చేతనుడు మనదీ అనే భావనతో వున్నాడు. అతనికి వరుణుడు అని పేరు. అలా ఈశ్వరుడు అనుగ్రహం చేశాడు, ఆ విధంగానే అగ్నిదేవుడు, ఎక్కడ నిప్పువున్నా అవన్నీ తనశరీరమని అభిమానించివున్న చేతనుడు అగ్ని దేవుడు. మనం ఉపనిషత్తులో ''దేవపితృకార్యాభ్యాంన ప్రమదితవ్యం'' అని అంటాము. అందులో మనం అలక్ష్యంగా వుండ కూడదు. ఏ దేవునికి అర్పణచేసినా అంతర్యామిరూపేణా ''జనార్దనః ప్రీయతాం'' ''పరమేశ్వరః ప్రీయతాం'' - అని ఆ ఒక్కడికే చేరుతుంది. ఈ అగ్నికి గాని, వరణునికిగాని, అర్పణ చేస్తున్నా మంటే ''పరమేశ్వరం ప్రీణయామి''- ఇదంతా ఆ పరమేశ్వరునికి ఒక్కనికే చెందుతుంది. ''సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిచ్ఛతి'' ఏఒక్కడి పేరైతే చివరి వాక్యంగా వుందో, ఆ భగవంతుడు గీతలో ఏమి చెబుతున్నాడు? ''తైర్దత్తాన ప్రదాయైభ్యో యోభుంక్తేస్తేన ఏవసః'' అన్నీ ఎక్కడో బజారులో కొన్నాం అనుకో కూడదు. బజారులో వాడికి ఎవరు ఇచ్చారు? ఇది ఎక్కడ పుట్టింది? ఆ శక్తిని ఎవరు ఇచ్చారు? ఆ నీళ్ళు ఎవరు ఇచ్చారు? ఆ విత్తనాలు, చెట్లు ఎవరు సృష్టించారు? ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు పాలిస్తున్నారు?

మనకు మించిన శక్తిలోనుంచి వచ్చే పదార్థాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించి, -అన్నంగాని, పానంగాని, వస్త్రంగాని అనుభవించి వీనిని ఎవరు ఇచ్చారని ఆలోచించకుండా -ఎవడు ఇవ్వకపోతే లాక్కుపోతాడో వాడికి మాత్రం పన్నులు కట్టి, నిజంగా మన నిత్యావసరాలను ఎవరు ఇస్తున్నారో వారికి పన్నుకట్టకుండా వుంటే వాడు దొంగ అవుతాడు. దొంగ అని తక్షణం తెలిసి వాడికి శిక్షపడితే, వాడు మంచిపనులు చేసినప్పటికి కూడా వాడికి అనుగ్రహం కలగటానికి కారణం వుండదు, గవర్నమెంటువారికి, రాజకీయాలవారికి అపుడపుడూ మనం డబ్బు ఇచ్చుకుంటాము-అది భయంచేత ఇచ్చుకుంటాము. అనేక రకాల పన్నులు కట్టే మనం, అన్నింటికీ మించిన శక్తికి కృతజ్ఞతతో పన్ను కట్టవలసిన అవసరం వుంది. మనమలా చేయక ఏదో నిర్బంధం చేత, ఇది కట్టకపోతే ఏమినష్టం వాటిల్లుతుందో అని భయపడి పన్ను చెల్లిస్తే - అది కృతజ్ఞత కాదు. అలాంటి సందర్భంలో మనకు పాపపరిహారం కూడా కాదు.

మనకు కావలసిన ఆహారాన్ని ఎవరు మనకు ప్రసాదించారో మొదట వారికి నివేదన చేసి తరువాత మనం భుజిస్తాం, ఇంటిలో పెద్దవాళ్ళకూ, ముసలివాళ్ళకూ, మొదట వడ్డన చేస్తాం, లేకపోతే వాళ్ళు అరుస్తారనీ, శాపంపెడతారని కూడా కొందరికిభయం. ఈ విధంగా కాకుండా కన్నతల్లి తన బిడ్డకు పిండివంటనో, భక్ష్యాన్నో ఇస్తే, ''నువ్వుతింటేగాని నేను తినను'' అని ఆ బిడ్డ తిరిగి తన తల్లికి ఇస్తే, ఆ తల్లి, ఇతరులు ఎంత సంతోషిస్తారో వూహించండి. ఎదిగి పెద్దవాడయిన తరువాత అలా ఇవ్వటంలో లాభంలేదు. కేవలం అజ్ఞానదశలో వున్నపుడు ఇదంతా ఎవరు ఇచ్చారు అని యోచించి, అతనికి కొంతయినా పెడదాము- అని అనుకోవడంలోనే విశేషముంది.

మనపూర్వులు కూడా వైశ్వదేవంలో ఏలోకంలో ఎవరెవరున్నారో, వారిని తలచి అన్నంపెట్టేవారు. ఈ లోకంలో, కుక్కలు, నీచులు, చండాలురు, రాక్షసులు - అందరినీ తలచి కొంత అన్నం పెట్టేవారు గవర్నమెంటు వారు కాని, శ్వేతజాతీయులుగాని, పరస్పరం కూడి 'పార్టీ'లు చేసుకునే టపుడు ఎవరినో ఉద్దేశించి 'టోస్ట్‌ప్రపోజ్‌' చేస్తున్నారు. ఏమిటి దాని అర్థం? ఏ యే లోకంలో ఎవరెవరు కష్టపడుతున్నా, వారందరినీభావించిసుఖంగావుండాలని కోరుకోవడమే దాని అర్థం. అదే విధంగా వైశ్వదేవంలో సకల దేవతలకు కొద్దిగానైనా, సరే అన్నం పెట్టి ప్రపంచమంతా శాంతంగా వుండాలని ప్రతిరోజు కోరుకుంటూండేవారు.

మనం ఇల్లు కట్టుకోవడానికి ముందు దేవాలయం కట్టుకోవాలి. దేవాలయం కట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటే అది ఒక దొంగతనం, ఎవనిశక్తితో నైతే మనం ఇల్లు కట్టడము కాని, తిండి తినడముకాని సాధ్యమవుతున్నదో, అతనికి మొదట నివేదనం చేసి, ఆ పిమ్మట మనం స్వీకరించాలి. ప్రతివారూ తమ ఇంట్లో పూజచేసి, దేవునికి అర్పణచేసి ఆ నైవేద్యాన్ని తీసుకొనడం మంచిది, అయితే ప్రపంచంలో మనకు అనేక పనులుంటవి, అందరూ ఇంట్లో కూర్చొని పూజలు చేస్తుంటే ప్రపంచంలో పనులు సరిగా జరుగవు. అందుకుసమష్టిగా పూజచేయడానికి ఒక సాధనం. అదే దేవాలయం, అక్కడ విష్ణురూపంగానో, ఈశ్వరరూపంగానో, అమ్మవారి రూపంగానో, గ్రామరక్షా దేవతగానో-ఒక ఆలయనిర్మాణం-ఇలా అనేక ప్రకారాలుగా ఆగమశాస్త్రంలో చెప్పబడివుంది. కొద్దిమందిని ఈ పనులకు నియోగించాలి. గ్రామస్థులంతా కలసి, దేవాలయాన్ని నిర్మించి, అక్కడ ఒక అర్చకుణ్ణి ఏర్పాటు చేసి, అతని కుటుంబ జీవనానికి, అతిని పరార్థపూజకు (అతని స్వార్థపూజ వేరేవుంది.) కావలసిన ఏర్పాట్లు చేస్తే ప్రజలందరూ కృతజ్ఞు లవుతారు.

మనం కట్టుకునే బట్టకంటే ఈశ్వరార్పణమైన బట్ట శుచిగా వుండాలి, మనం తినే అన్నంకంటే దేవుని నైవేద్యం శుచిగా వుండాలి. మన కిపుడు రేషన్‌ రావడంతో, 'ఈశ్వరునికి ఆ నైవేద్యం మటుకు ఎందుకండీ?' అని తగ్గించివేసేస్థితిలో కొచ్చాం, ఇదివరకు, నాకు జ్ఞాపక మున్నంత వరకు, రాత్రి కాలంలో కూడా, రాత్రిపూజ, అర్థయామ పూజ అని సుమారు తొమ్మిదిగంటల కొక పూజచేసేవారు. అపుడు గంటకొట్టేవారు. అది ఎందుకండి అంటే ''ఈశ్వరుని పూజ అయింది - ఇక మనం భోజనం చేయవచ్చు'' అని తెలుసుకోడానికి. ఆగంట వినకపోతే ఇంట్లో భోంచేసేవారు కాదు.

ప్రజలు అందరూ ఈవిధంగా వుంటే ఇపుడున్న దేవాలయాలు సరిపోతాయా? అతనికి అర్పణం కాకపోతే మనం భోజనం చేయకూడదనే భావన అందరికీ రావడానికి ఇంతకు వెయ్యిరెట్లు దేవాలయాలు కావాలి.

అతనికి వస్త్రం ఇవ్వకుండా, మనం వస్త్రధారణం చేయకూడదు, అందుకొరకు ఒక స్థానం ఆస్థానంలో అతని సాన్నిధ్యం కావాలి. ఆ సాన్నిధ్యానికి ఒక శాస్త్రం, దానిని ఆగమం అంటాము. అతనికి ఇల్లు కట్టించాలంటే ఒక విధానం. ఆవిధానానికి కొక శాస్త్రం. దానిని శిల్పం అంటాము. అతనికి రోజూ పూజ చేయడానికి ఒక విధానం. అందులో ఉపచారం-అపచారం-ప్రాయశ్చిత్తం- అపచారానికి పరిహారం-ఇవన్నీ చేయించి అక్కడ సాన్నిధ్యం తగ్గకుండా చేయించుకొనడం మందరికీఅవసరం. మనజీవనం జరగడానికే, ప్రతిక్షణం సావధానంగా మనకు అన్న, వస్త్ర, చ్ఛాయలు ఇస్తున్న ఈశ్వరుడు-అతని ఆజ్ఞ పరిపాలిస్తున్న దేవతలు-వారిని స్మరించి ఇవ్వడం- ఏ దేవతలకుఅర్పించినా ఆ పరమేశ్వరునికి ఇచ్చినట్లుగా భావించడం అవసరం. ఏ యేస్థానంలో, ఏ యేవిధంగా ఏయేదేవాలయం కట్టించాలో తెలిపేది ఆగమశాస్త్రం. మొత్తంమీద పసిపాపలు మొదలుకొని-ఒక గోపురాన్ని చూసినట్లయితే దేవుడు అని వారికి జ్ఞాపకం వస్తుంది. అందుచేత భగవత్‌ స్మరణకు దేవాలయం ఒకకారణం మయింది. ఆ దేవాలయం లేకపోతే మనం కృతఘ్నలవుతాము, మనం కట్టించకపోయినా, మనపెద్దలైనా ఒక దేవాలయం కట్టించారు గదా, అందులోమనకు తెలియకుండానే మన కుటుంబపు సొమ్ము, సొత్తు కలిసి వుందిగదా. మనం నేడు కృతఘ్నుల మైనప్పటికీ- మనపూర్వులు ఆదేవాలయానికి అర్పణ చేసిన కారణంగా కొంతవరకైనా కృతజ్ఞత కలసివుంటుంది. ఈ కారణంచేత నైనా మనం దేవాలయాలను రక్షించాలి. అదే మనకు ఈశ్వర స్మరణ కావాలి. అది లేని దినం వ్యర్థం, జన్మవ్యర్థం, శాంతికి అవకాశం లేకుండా పుట్టి చావడంలో అర్థంలేదు. సదా రామకోటి వ్రాస్తూ, ధ్యానజపాదులలో నిమగ్నులైన మహనీయులు ఇంకా వున్నారు. వారందరూ పోతే ఈ ప్రపంచమే ఉండదు. ఇపుడున్న స్థితి ఇంతవరకైనా వుండదు. వారి సంగతి కాదు నేను చెప్పడం, అందరికీ భగవత్‌ స్మరణ కలగడానికి దేవాలయం ఉద్దేశింపబడింది.

భగవత్‌ స్మరణకలిగే క్షణమే మనకు శాంతిక్షణం. భగవత్‌ స్మరణకు దేవాలయం కారణం. అందువల్ల దేవాలయం కావాలి. దేవాలయ గోపురం, విమానం నిర్మాణం శైలి కూడా సాన్నిధ్యం కలిగించేలా వుండాలి. దానికి శాస్త్రం సంప్రదించాలి. ఈ విధంగా ప్రజలకు భగవత్‌ స్మరణ తగ్గకుండా వుండడానికి మూల భూతమైన శాస్త్రములు తెలిసినవారు, నేటి రాజకీయ పరిస్థితులు, విద్యారీతులు, జీవనధోరణులు కారణంగా రానురాను తగ్గిపోతున్నారు. వారు ఎక్కడెక్కడ వున్నారో తెలుసుకోవాలి. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఏవేవి వున్నాయి? అందులో ఏమి వ్రాసి వుంది? ఆవన్నీ తెలుసుకోవాలి. ఇంకా పదిసంవత్సరాలు వూరుకుంటే- ఈ మిగిలినవి కూడా పోతాయి. వీటిని ఎరిగిన వారూ పోతారు. అందుచేత వీటిని రక్షించడం మనకర్తవ్యం.

అసలువీటన్నింటికీమూలభూతుడు వ్యాసుడు, అతను పురాణాలు రచించాడు. వేదవిభాగం చేశాడు. వేదాంతానికి ఉపనిషత్తులు రచించాడు; బ్రాహ్మణతరుడైన నూత మహరి చేత సూతపీఠ స్థాపన గావించి అష్టాదశ పురాణ ప్రవచనం అతనికి ఒప్పచెప్పాడు. ఇతర ఋషులు ఎవరైనా సరే మొదట సూతునికి వందనంచేసి, అతనివద్దనుండి పురాణ సాహిత్యాన్ని గ్రహించేట్లుగా వ్యాసుడు ఏర్పాటుచేశాడు. ఆపురాణాలు పామరులకు మిక్కిలి ఉపయుక్తంగా వుండాలనే ఉద్దేశంతో వ్యాసుడు ఈ విధంగా ఇతర కులాలకు అధికారమిచ్చాడు. అదేవిధంగా రాజసూయ యాగంలో బ్రాహ్మణులు క్షత్రియులను గౌరవించే విధంగా వారికి ఉన్నతస్థానం ఇచ్చారు.

నీతితో జీవించాలి :

మనం చెడ్డపనులు చేయకూడదు, కొన్ని ధర్మాలు వున్నవి. సత్యం పలకాలి. అబద్ధా లాడ కూడదు. ఒకరిని నిందించకూడదు. వ్యర్థంగా, అకారణంగా హింస చేయకూడదు. అపుడపుడు హింస చేయవలసిన అనవసరం వస్తుంది. అయితే మహాభారతంలో అర్జునుడు యుద్ధంచేసి నట్లుగా న్యాయాధిపతి నేరస్థుణ్ణి శిక్షించితీరాలి. అతను శిక్ష వేయకపోతే ప్రపంచంలో అక్రమం పెరిగిపోతుంది, అనవసరమైన హింసకూడదు గాని, కొన్ని సందర్భాలలో హింస చేయాలి. నిత్యజీవితంలో ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవడం? చదివినందువల్ల వివేకం, జ్ఞానం వస్తవి అనుకుంటాము. కాని ఇది అనుమానాస్పదమైన విషయమే, ఎందుకంటే ఎక్కడైతే యూని వర్సిటీలు యెక్కువ వున్నవో, అక్కడే నేరాలుకూడా ఎక్కువగా వినపడుతున్నవి. చెంచులు, సవర్లు, ఆఫ్రికాదేశస్థులు నివసించే అడవులలో ఇక్కడున్నన్ని కోర్టులుగాని, కేసులుగాని కనబడటంలేదు, వాళ్లు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు. అంతటితో వాళ్ళ వివాదాలు నిలచిపోతున్నవి గానీ, ఇక్కడున్నంత కాపట్యము, ఫోర్జరీలు, అబద్ధాలు అక్కడ కనబడటంలేదు. అలాంటివి వారికి తెలియనే తెలియదు, మనకాపులకు, భూములలో పనిచేసేవారికి అసలు అబద్ధాలాడవలసిన అవసరమే లేదు. స్వాతంత్ర్య సముపార్జనం తరువాత మనదేశంలో అబద్ధమాడనివాడు లేకుండా పోయాడు. ఓటు వేస్తానని లంచాలు తీసికొని అబద్ధా లాడటం ఈ రోజులలో అందరికి అలవాటయి పోయింది. ఇదివరలో, నాచిన్నతనంలో, ఎవరో కొందరు ఉద్యోగస్థులే లంచాలు పుచ్చుకొంటారని వినేవాళ్ళం, ఇప్పుడు ప్రతిఊళ్ళో, ప్రతిఉద్యోగికి అబద్ధాలాడటం అలవాటయిపోయింది. అబద్ధమాడటం తప్పు అనిభావించడానికి వీలుగా హరిశ్చంద్రనాటకం మనహృదయంలో జ్ఞప్తికి వస్తుంది. 'సత్యమే పలుకు' అని వేదంలో చిన్న మాట విన్న మరుక్షణం ఎక్కడికో పోతుంది, ఆ సందేశాన్ని ప్రజలలో స్థిరమైన ధర్మవివేచనం కలుగుతుంది. చూసిన ప్రజలలో స్థిరమైన ధర్మ వివేచనం కలుగుతుంది. హరిశ్చంద్రడు అనుభవించిన కష్టం అంతా ఇంతాకాదు - భార్యపోయినా, బిడ్డలుపోయినా, అవమానమువచ్చినా, దారిద్ర్యమొచ్చినా - ఎంత కష్టమొచ్చినా నేను అబద్ధం చెప్పను, ఈ ప్రపంచం వచ్చినా, పోయినా, అబద్ధం చెప్పననే ఆదర్శపురుషుడు ఒక్కడైనా వున్నాడు- అని తెలుసుకొన్నప్పుడు ప్రజలలో దృఢమైన ధర్మబుద్ధి కలిగేది, సీత, సావిత్రి, వంటి పతివ్రతలకు శ్రీరాముడు, హరిశ్చంద్రునివంటి వారి కొచ్చిన కష్టాలు చెప్పనలవికానివి. వీరి దివ్య చరిత్రలను ఇది వరకు చదివి తెలుసుకొనేవారు. నిరక్షరాస్యులు, వృద్ధులు, పాటకులు మొదలైన వారు ఈ పుణ్యచరిత్రలను గ్రామాలలో చిన్న ప్రదర్శనలుగా కళ్ళారా చూసి ధర్మావలంబకు లయ్యే వారు.

8-15ొ

ఇప్పుడేమో సినిమా ప్రదర్శనం వచ్చినది, వీటిని చూసినప్పుడు హృదయంలో అధర్మాలే ఎక్కువవుతున్నాయి-ఆపమార్గబుద్దే ఎక్కువవుతున్నది. పురాతన ప్రదర్శనలు సన్మార్గ ప్రబోధకంగా వుండి, హృదయానికి ఒక శాంతిని ధర్మబుద్ధినీ కష్టసహిష్ణుతనూ - ఏ బడికి వెళ్ళని వారికి కూడా ప్రసాదిస్తూ వుండేవి. నేటికి ఇన్ని సినిమాలు వచ్చినా, ఏ దేవాలయం వద్దనో, ఏదైనా ప్రదర్శనం ఏర్పాటుచేస్తే జనం సమకూడుతూనే వున్నారు, ఈ జానపద ప్రదర్శనలను చూసి పూర్వం విద్యాగంథం లేనివారు కూడా ధర్మం గొప్పదనీ, అథర్మంగా వుండకూడదనీ, అధర్మపరులైన రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు విశేష ఐశ్వర్య బల సంపన్నులయి కూడా చివరకు అన్ని విథాలా నష్టపడ్డారని తెలుసుకొనేవారు.

ఇదివరలో నేను దేశాటన చేసినపుడు అనేక చోట్ల పరంపరానుక్రమంగా వస్తున్న వివిధ జానపద కళాప్రదర్శనలను గమనించాను. నేడు వేదం చెప్పుకొనేవారు, స్మార్తం చెప్పుకొనేవారు, తగ్గనట్లుగానే ఆ కళాకారులుకూడా తగ్గిపోతున్నారు. మరొక ముప్పయి సంవత్సరాలు గడిస్తే ఇంట్లో శుభకార్యం చేసుకోడానికి పౌరోహితుని వెతుక్కోవలసి వస్తుంది. అదేవిధంగా ఈ ప్రదర్శకులు కూడా క్రమేణ తగ్గిపోతున్నారు. పూర్వంనుంచి ఈ ఆగమశిల్ప కళలను నమ్ముకొని వున్నవారికి తమ హయామలోనే ఈ విద్యంతా పోనివ్వము అనే ఆలోచన కలుగకుండా, వారు తమ పిల్లలలను, ఏదో జీవనానికి కక్కుర్తిపడి, కాలేజీ చదువులలోకి దించకుండా-వారు ఆయా వృత్తులను అభ్యసించేందుకు కావలసిన పరిస్థితులు కల్పించి, వారిని గౌరవించ వలసిన బాధ్యత మనపై వుంది.

కేంద్రప్రభుత్వము రాష్ట్రప్రభుత్వము ఇప్పుడు సంగీతనాటక అకాడమీలు స్థాపించారు. అందులో సంగీతము నృత్యము. నాటకమునకే వారు సహాయం చేస్తారు. ఈ మూడింటిచేత ఆత్మగుణ వృద్ధి కంటే దుర్గుణవృద్ధి ఎక్కువవుతున్నది. దానికే వారు సహాయం చేస్తున్నారు. ఇటీవల సినిమాలకు కూడా పై#్రజులు ఇస్తున్నారు.

సినిమా ప్రదర్శనలు చిత్తాన్ని కలుషితంచేసి, కామం, మోహం, అసత్యం, మోసం మొదలైన వాటిని హృదయంలో నెలకొల్పుతున్నవి.

కాని వాటికే ప్రభుత్వాదరణ లభిస్తున్నది. చదువు రానివారికి, బిడ్డలకు, వృద్ధులకు, ఏ అక్షరం తెలియనివారికి, ధర్మంలో స్థిరమైన వృద్ధి అది వారుచేసినా చేయకపోయినా - కనీసం ఇదిధర్మం - ఇది అధర్మం అనే వివేచనవారికి కలుగజేయడానికి ఏ ప్రయత్నమూ జరగటం లేదు. సినిమాలు వచ్చిన తరువాత ధర్మాధర్మ వివేచనంకూడా లేకుండా పోతున్నది. అధర్మమే ధర్మమనే భావన కలిగే అంతటిస్థితికూడా వచ్చింది. పూర్వం అలాకాదు ఇది ధర్మం -చేయదగినది - ఇది అధర్మం- చేయకూడనిది - ఇదే మనకృతార్థత, చరితార్థత అనే భావన వుండేది. అలాంటి స్థితికి కారణమైన కళలు, విజ్ఞానాలు, ప్రదర్శనలు, వంశపారంపర్యంగా అభ్యసిస్తున్న వారు వాటిని వీడకుండా చూడవలసిన బాధ్యత ఇదివరలో రాజులయొక్క ధర్మంగా వుండేది. ఇపుడు రాజులు లేరు. అందరూ రాజులే- మన మందరము రాజులమే, ఇలాంటి పరిస్థితిలో మనమే పూనుకొని ముఖ్యంగా మనం రక్షించాలంటే దేవాలయాలనే రక్షించాలి. దేవాలయాలను రక్షించే శాస్త్రాలను తెలుసుకొని ఆ శాస్త్రజ్ఞులను రక్షించి, వారికొక స్థానమిచ్చి, గౌరవమిచ్చి, ఆ వంశంలో వుండే కుర్రవాళ్ళని సాధ్యమైనంతవరకు ఈవిద్య లోపించకుండా వుండడానికి ప్రోత్సహించి, ఇదే విధంగా పల్లెలలో చదువురాని ప్రజలలో ధర్మవృద్ధి కలిగేటటువంటి ప్రదర్శనలు ఏవివున్నవో వాటిని ప్రోత్సహించి పరంపరగా దేవతాసన్నిధిలో వారు ఏమిచేస్తుండేవారో అది కొనసాగించటం చాలా ముఖ్యమని, మిగతా ఏవీ అంత ముఖ్యం కాదని నాకుతోచింది.

ఎవరైనా ఆనందగజపతి రాజులాంటి వారు వుంటే నేను ఇదంతా వారికి చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరికి చెప్పకోవడం? అందువల్ల అందరూ ఇందుకు పూనుకొని, ఏదోపల్లెలో ఒక పాకలోవుండి, శాస్త్రం తెలిసివున్నవాడిని పిలిచింది. వాడి కొక స్థానమిచ్చి - పెద్ద సన్మానాలు ఏవీ చేయడం లేదిక్కడ. ఊరకే స్థానమిచ్చి ఒకరినొకరు తెలుసుకునే సందర్భం కలుగజేస్తేనే వారికి సంతోషంగా వుంది. వారిని మనం ప్రార్థించి, వారు చెప్పిన నాలుగుముక్కలను లోపంలేకుండా మనం ఆచరించాలి. అదేవిధంగా, గ్రామాల్లోవున్న చిన్నచిన్న కులాలవారికి పెద్దచదువు, ఐశ్వర్యం లేకపోయినప్పటికీ పరంపరగా వస్తున్న భగవత్‌ స్మరణం సంధాయకములు. ధర్మప్రబోధకములై విద్యలు కళలు, శాస్త్రాలను పేరుకైనా, పోషించే ఉద్దేశంతో సంవత్సారిని కొకతూరి సమీకరించ మని మిమ్మల్ని కోరాలి అనుకొన్నాను. ఇప్పుడు కోరుకున్నాను.

నమః పార్వతీపతయే


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page